YOGI_VEMANA_SHATHAKAM
1. చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియుఁకొదువకాదు
విత్తనంబు మజ్జివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.
మనసు పెట్టి చేస్తే ఏ చిన్న వనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రిచెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము.
2. ఆత్మశుద్ధి లేని యాచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
ఆచారాలు అంటూ గంతులు వేసే పెద్దలందరూ వినండి ఆచారాలు మూఢ నమ్మకా లుకాకూడదు. కుండ సరిగా లేకపోతే వంట రుచిగా రాదు. మనసు శుచిగా లేక పోతేనువ్వు పట్టువస్త్రము కట్టుకొని, దురాలోచన చేస్తూ, ఇతరులకు కీడు తలపెడు తూ, శివుని మీద పూలు వేస్తే, శివుడు నీకు మంచి ఫలితము నిస్తాడా?
3. గంగిగోవుపాలు గంటెడైనను చాలు
కడివెడైననేమి ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినురవేమ.
మనసుంచి చేసిన వంట, పెట్టిన భోజనము సంతృప్తినిస్తుంది తప్ప, వేలాది రూపా యలు ఖర్చు పెట్టి, వేలం వెర్రిగా విందొనరించామని, వచ్చినవారి అజ కనుక్కోకపోతే అది తృప్తినిస్తుందా! కడవ నిండా గాడిద పాలున్నా, మంచి గోక్షీరము రుచి దాని కొస్తుందా!
4. నిక్కమైన మంచినీలమొక్కటిచాలు
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
చాటుపద్యమిలను చాలదా యొక్కటి?
విశ్వదాభిరామ వినురవేమ.
జాతిరత్నమొక్క దాని విలువ పూత మెరుగు రాళ్ళకు రాదు. వేలాది పనికిరాని కవి తల కన్న మంచి నీతిగల చాటు పద్యమొక్కటి చాలు అని తన పద్యముల విలువ చెప్పకనే చెప్పుకున్నాడు వేమన.
5. మిరపగింజచూడ మీద నల్లగనుండుఁ
గొరికిచూడ లోనఁజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.
దీపము యొక్క కాంతి చాల దూరము ప్రసరించినట్లే నజ్జనుల యొక్క ప్రభావము చాల దూరము పోవును. మిరపకాయ పైన నల్లగ నున్నను కారము ఎంత చురుక్కు మనునో సజ్జనుల ప్రభావము దుర్జనులను కూడ మార్చును.
6. మృగమదంబుఁజూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా!
విశ్వదాభిరామ వినురవేమ.
కస్తూరి రంగు నల్లగనున్నను దాని పరిమళము ఎంత మిన్ననో మంచివారి గుణము లు ప్రజలు తలచుకొని మురిసిపోని రోజుండదు.
7. మేడిపండుచుడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడఁబురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.
చెడ్డవాడు పైకి మంచిగా కనుపించినప్పటికీ వానిచెడ్డగుణములు కీడునే కలిగించు ను. అది ఎట్లనగా మేడిపండులో పురుగులుంటే అవి పనికిరావు కదా!
8. నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేరునన్నవాఁడు నిందజెందు
ఊరుకున్నవాఁడె యుత్తమయోగిరా!
విశ్వదాభిరామ వినురవేమ.
అన్ని తెలుసు అని అహంభావముతో ప్రవర్తించువాడు నిందల పాలగును. ఏమీ తెలి యదని తెలుసుకో గోరినవాడు మౌనముతో అన్నియు తెలుసుకొనువాడు నీతిమం తుడు.
9. గంగ పారునెపుఁడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్నతనము పేర్మియీలాగురా,
విశ్వదాభిరామ వినురవేమ.
అల్పులు, దుష్టులు ఆవేశముతో, దుడుకు తనముతో, తొందరపాటుతో మెలగుతారు.
పెద్దవారు, మంచివారు, సజ్జనులు నిండుకుండ తొణకనట్లు నిండుగా, హుందాగావర్తిస్తారు.అది ఎట్లనగా గంగానది, గతి తప్పక హుందాగా ప్రవహిస్తే మురుగుకాలవ కలుషితమయిన నీటితో, దోమలు ఈగల మోతతో, దుర్వాసనతో రోగాలు వ్యాప్తిచెం దించినట్లు.
10. నిండునదులు పారు నిలచిగంభీరమై
వెట్రివాగు పాఱు వేగఁ బొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమ.
అల్పజ్ఞుడు ఆవేశముతో అన్ని పనులను చెడగొట్టునటుల. సెలయేరు ఒడిదుడుకలతో ప్రవహించి అన్నింటిని ధ్వంస మొనర్చినట్లే, వివేకవంతులు నిండునదులవలె నీతి బోధలొనర్చి పనులు సఫలము చేయుదురు..
11. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కుఁజల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
బంగారపు శబ్దము కంచు శబ్దముకైన తక్కువైనట్లే మంచివారి మాటలు చల్లగాను నీతియుతంగాను వుండి మంచినే పెంపొందిస్తాయి. నీచులకు వాగాడంబరం ఎక్కువ.
12. కులములోన నొకఁడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.
ఒక్క రాముని వలన ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట ఇనుమడించినట్లుగా, ఒక్క గంధపు చెట్టు వలన అరణ్యమునంతకు సువాసన వచ్చినట్లు ఒక్క గుణవంతుని వలన వంశ మునకంతకు మంచిపేరు వచ్చును.
13. పూజకన్న నెంచ బుద్ధిప్రధానంబు
మాటకన్న నెంచ మనుసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినురవేమ.
బుద్ధి నిలకడగా వున్న పూజ, నిలబెట్టుకొనిన మాట పేరు తెచ్చినట్లే మంచిగుణము, కులమేదైనను పేరుగాంచును. కుమ్మరివాడైన కురువరతి నంబి ప్రసిద్ధి చెందిన భక్తుడవలేదా!
14. ఉత్తముని కుడుపున నోగు జన్మించిన
వాఁడుచెఱచు వాని వంశమెల్లఁ
జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
విశ్వదాభిరామ వినురవేమ.
చెరకుగడ చివరవెన్ను పుట్టిన తియ్యదనము కోల్పోయినట్లే మంచివాని కడుపున నీచుడు పుట్టిన వంశ ప్రతిష్టను పాడుగావించును.
15. కులములోన నొకడు గుణహీనుడుండినఁ
కులముచెడును వాని గుణమువలన
వెలయుఁజెఱకునందు వెనువెడలినట్లు
విశ్వదాభిరామ వినురవేమ.
వెన్ను వల్ల చెరకుగడ తియ్యదనము కోల్పోయినట్లే కులములో ఒక నీచుడు పుట్టినచో వంశ గౌరవమును నాశమొనర్చును.
16. రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁజెఱచే
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకా
విశ్వదాభిరామ వినురవేమ.
శ్రీ రాముడు రఘు వంశమునకు ఖ్యాతి తెచ్చాడు. కాని దుర్యోధనుడు వల్ల కురువం శంనాశనమైపోయింది. ఇలలో పాప పుణ్యములు ఈ విధముగా వుండునని వీరు నిరూపించారు.
17. హీన గుణమువాని నిలుసేర నిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపుఁజొచ్చి యిట్టట్టు సేయదా?
విశ్వదాభిరామ వినురవేమ.
ఈగ కడుపులో చేరిన అతలాకుతలమైనట్లే నీచునితో సావాసమైనర్చిన వారు కిందు మీదగుదురు.
18. వేరుపురుగుచేరి వృక్షంబుజేఱచును
చీడ పురుగు జేరి చెట్టుఁవెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁవెఱచురా
విశ్వదాభిరామ వినురవేమ.
చెడ్డగుణము కలిగిన వారికి ఆశ్రయమిచ్చినవారే, పురుగుకు ఆశ్రయమిచ్చిన చెట్టు మూలచ్చేదమగునట్లు, నాశనము పొందుదురు.
19. అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని
ఘనుఁడుగాడు హీన జనుఁడెగాని
పరిమళముల మోయ గార్దభము గజమౌనె
విశ్వదాభిరామ వినురవేమ.
గంధములు మోయు గాడిదకు సువాసన రానట్లే విద్యలెన్ని నేర్చినను నీచుడు సుజ నుడు కాలేడు.
20. విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండుకాడు
కొలని హంసలకడం గొక్కెర యున్నట్టు!
విశ్వదాభిరామ వినురవేమ
కొలనులో హంసల నడుమ కొంగ యున్నను దాని జాతిబేధము గుర్తింపబడినట్లే విద్యాధికుల మధ్య అవివేకి యున్నను వానికి వివేకము కల్గదు.
21. అల్పజాతి వాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల దొలగఁజేయు
జెప్పుందినెడు కుక్క చెఱకుతీ పెరుగునా?
విశ్వదాభిరామ వినురవేమ.
చెప్పులు తినే కుక్క చెరకు తియ్యదనము తెలిసికోలేనట్లు, గొప్పవారి గొప్పగుణము లను నీచుడు తెలిసికోలేక అధికారము కలిగిన వారినందరిని వెడలగొట్టును,
22. అల్పుడైనవాని కధిక భాగ్యముగల్గ
దొడ్డవారి దిట్టి తోలఁగొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెరుగునా:
విశ్వదాభిరామ వినురవేమ.
గడ్డికుప్పను కుక్కను కావలి కాయుమన్న గడ్డి తనకు పనికిరాకున్నను, అవసరమైన ఆవునైన దగ్గరికి రానీయదు, నీచునకు అధికారము కల్గిన సుజనులను దగ్గరికి రానీయడు.
23. ఎద్దుకైనగాని యేడాది తెలిసిన
మాటఁదెలిసి నడుచు మర్మమెరిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన,
విశ్వదాభిరామ వినురవేమ.
జంతువైనను శిక్షణ కల్గిన మనసెరిగి మసలుకొనును. మూర్ఖుడు ఎంత శిక్షణ నొసగినను తెలియనితనమును పోగొట్టుకొనలేడు.
24. ఎలుకతోలుఁదెచ్చి యేడాది వుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొమ్మబొమ్మ దెచ్చి కొట్టినఁబలకునా
విశ్వదాభిరామ వినురవేమ.
ఎలుక తోలును ఎంత ఉతికిన తెలుపు అవదు. మానవ స్వభావ సిద్ధములగు గుణ ములను ఎంత ప్రయత్నము చేసినను మార్చలేము. అది ప్రాణములేని కొయ్యబొమ్మ ను మాటలాడుమన్నట్లుంటుంది.
25. పాముకన్న లేదు పాపిష్టజీవంబు
అట్టిపాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరునులేరు
విశ్వదాభిరామ వినురవేమ.
దుర్మార్గుడి దుర్లక్షణాలను మానిపించి సజ్జనుడుగా చేయుట చాల కష్టము. అనితర సాధ్యము,
26. వేము పాలుపోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపిఁజెందబోదు
ఓగునొగెగాక యుచితజ్ఞు డెటులౌను?
విశ్వదాభిరామ వినురవేమ.
వేప చెట్టుకు పాలు పోసి పెంచినను తియ్యదనము రానట్లే, నీచునకు ఎన్ని నీతులు నూరిపోసినను సజ్జనుడు కాలేడు. అటువంటి నీచుని చెలిమి మనకు కూడ హాని కల్గించును.
27. ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు
బరగ మూలికలకు బనికివచ్చు
నిర్ణయాత్మకుండు నీచుడెందులకౌను
విశ్వదాభిరామ వినురవేమ.
ఎంతో చేదు వృక్షములైన వేప, ముషిణి చెట్లు సైతము మందుల తయారీలో పుప యోగపడును, క్రూరాత్ముడైన మానవుడు ఎవరికి వుపయోగపడగలడు?
28. పాలు పంచదార పాపర పండ్లలోఁ
చాలబోసి పండఁచవికి రాదు
కుటిల మానవులకు గుణమేలు గల్గురా
విశ్వదాభిరామ వినురవేమ.
చేదుగావుండే పాపరపండ్లలో పాలు పంచదార వేసి వండితే తీయదనము రాదు కదా! అలాగే వంకర బుద్ధిగల నీచులకు ఎన్ని గుణములు కరిసిననూ బుద్ధిరాదు.
29. పాల నీడిగింటఁ గ్రోలుచునుండెనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగనిచోట నిలువ నిందలువచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.
నిలువదగని చోట నిలిచి మంచి పని చేసిననూ అది చెడ్డపనే అని అన్పించుకొను ను. అది ఎట్లన కల్లు అమ్మేవాని ఇంట్లో పాలు తాగినట్లు. ఇటువంటి పద్యమే సుమతీ శతకంలో కూడా కన్పిస్తుంది. శతకకర్తల భావముల సారూప్యము విది తము.
30. కాని వానితోడఁ గలసి మెలఁగుచున్న గాని
వానివలెనే కాంతురవని
తాడి క్రిందఁబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ.
యోగ్యతలేని వారితో చెలిమి నిన్ను కూడా అయోగ్యునే చేస్తుంది. తాడి చెట్టుక్రింద నిలబడి పాలుత్రాగినను కల్లుత్రాగినట్లే అని అందురు. సంపదయున్న కులము, గోత్రము, వంశ గౌరవము, విద్యాధికృత ఇవన్నియు తృణప్రా యములే. ఏమనిన ఇవన్నియు ధనవంతుని ఆశ్రయింప వలసినదే.
31. తామసించి చేయతగఁ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమెయగును
పచ్చికాయదెచ్చి బడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినురవేమ.
పచ్చికాయ వేగిరపడి ఆరగించినను పండుగానట్టే, మిగుల వండినను, కుళ్ళెనను వ నికిరాదు. అలాగే సమయమునకు ముందుగాని మరీ వేళ తప్పిగాని ఏ పనిని చే యకూడదు. వేళ ఎరిగి పని చేయువాడే నిపుణుడు.
32. కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమునను మిగులఁ గోడు గల్గు
కోపమడచనేని కోర్కెలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ.
తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష కావున సమయమెరిగి పని చేయువాడే నేర్పరి.
33. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగు బట్టు
బయట గుక్కచేత భంగపడును
స్థానబలముగాని తన బలిమికాదయా
విశ్వదాభిరామ వినురవేమ.
34 నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బయట మూరెడైన బారలేదు
స్థానబలిమిగాని తన బలిమికాదయా
విశ్వదాభిరామ వినురవేమ.
35. నీళ్ళమీదనోడ నిగిడి తిన్నగఁబ్రాకు
బయట మూరడైన బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ.
ఎంత వీర్యవంతుడైనను తన చోటుకాని చోట ఓడిపోవును, నీళ్ళలోని మొసలి ఏను గునైనను పట్టును. బయట కుక్కయైనను మొసలిని ఓడించును. నెలవులు కాని చోట బలమొక్కటే చాలదు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనను వరస్థలములందు రాణింప లేడు. 'స్థాన బలిమి' కున్న ప్రాముఖ్యము ఇంతింతనరానిది. పరమ శివుని మెడలో వుంటే పాము కూడా తన శత్రువైన గరుత్మంతుని కుశలమడుగుతుంది. ఆ స్థానం లో లేకపోతే పరుగులిడుతుంది.
36. కులములేనివాడు కలిమిచే వెలయును
కలిమి లేనివాడు కులము దిగును
కులముకన్న భువిని గలిమియెక్కువసుమీ
విశ్వదాభిరామ వినురవేమ.
37. కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడి గలుగువాని బానిసకొడుకులు!
విశ్వదాభిరామ వినురవేమ.
సంపదయున్న కులము, గోత్రము, వంశ గౌరవము, విద్యాధిక్యత ఇవన్నియు తృణప్రా యములే. ఏమనిన ఇవన్నియు ధనవంతుని ఆశ్రయింప వలసినదే.
38. కనియు గానలేడు. కదలఁప నోరు
వినియు వినగలేడు విస్మయమమున
సంపద తలవాని సన్నిపాతం బిది.
విశ్వదాభిరామ వినురవేమ.
సంపద కలవారిలో కొంతమంది రోగులు (సంపద అనే గర్వము తలకెక్కినవారు) చూచి, విని కూడ, మధురముగా మాట్లాడిననూ లోక ధర్మవులు గ్రహింపకుందురు.
39. ఏమిగొంచువచ్చె నేమి తాంగొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగుఁదానిచ్చటికి నేగు
విశ్వదాభిరామ వినురవేమ.
40. తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్య మెవరిసొమ్ముదాచుకొనగ
బ్రాణ మెవరిసొమ్ము పారిపోవక నిల్వ
విశ్వదాభిరామ వినురవేమ.
సంపదయంతయు శాశ్వతమని, దైవము లేడని, కనపడేదంతా తన ప్రజ్ఞేనని నమ్మే వాడు తానేమియు తీసుకురాలేడని, తీసుకుపోలేడని, ప్రాణము అశాశ్వతమని ఎరుగనివాడు
41 గొడ్డుటావు బితుక గుండఁగొంపోయిన
పండ్లురాలఁదన్ను బాలవిదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.
42. మేక కుతుక బట్టి మెడచన్ను గుడువగా
ఆకలేల మాను నాశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.
పిసినారిని ధనమడుగ బూసుట పాలీయని ఆవువద్దకు వెళ్ళితన్నులు తినుట వంటిది. మేక మెడ చన్నులను పితుకుటవంటిది. ప్రయోజనశూన్యములయిన పనులను విజ్ఞుడు చేయడు.
43. పెట్టిపోయలేని వట్టినరులు
భూమి బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁజెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ.
పుట్టలోని చెదలు వున్నా చచ్చినా లాభంలేనట్లే మంచిగుణములు (దాతృత్వము మొ॥నవి) లేని మానవుడు ప్రమోదినశూన్యుడు.
44. ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుండ్రు భ్రమనుఁద్రిప్పలేక
మురికికుండమందు ముసరునీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ.
ఈ శరీరము శాశ్వతమను భ్రమతో పరమార్ధమరయగ లేని వాడు దిధికినను చచ్చి నను ఒకటే.
45. నీళ్ళలోన మీను నేరమాంస మాశించి
గాలమందు (జిక్కు కరణి భువిని l
ఆశదగిలి నరుడు నాలాగు చెడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ.
46. ఆశ పాపజాతి యన్నింటికంటెను
ఆసచేత యతులు మోసపోరె
చూచి విడుచువారె శుధ్ధాత్ములెందైన
విశ్వదాభిరామ వినురవేమ.
ఆశా పాశమునకు లోనయినవారు పరమాత్మపైన ధ్యాస నిలుపలేరు. బహిక భోగ భాగ్యములపైననే వారి ధ్యాస,
47. అన్నిదానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లికంటె ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.
దానములలో అన్నదానము, తల్లిని మించిన దైవము, జ్ఞానప్రదాత అయిన సద్గురువు కంటె గొప్పవిలేవు.
48. ఆశకోసివేసి యనలంబుచల్లార్చి
గోచిబిగియగట్టి గుట్టుదెలిసి
నిలిచినట్టివాడే నెఱయోగియెందైన
విశ్వదాభిరామ వినురవేమ.
పరిపూర్ణుడయిన యోగి అరిష్టృడ్గర్వములను జయించినవాడే.
49. కనకమృగము భువిని గద్దు లే దనకయె
తరుణ్ విడిచి చనియె దాశరథియుఁ
దెలివి లేనివాడు దేవడెట్టాయెరా
విశ్వదాభిరామ వినురవేమ.
భార్య కోరినదని మంచి చెడు విచారింపక మాయలేడి వెంట పరుగులిడిన రాముడు దేవుడెలాగయాడు.
50. చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పెరకి తినును బరగ గ్రద్ద
గ్రద్దవంటివాడు గజపతి కాడొకో
విశ్వదాభిరామ వినురవేమ.
దుర్మార్గుడయిన రాజు చచ్చిపడియున్న శవములను తిను గ్రధ్ధవంటివాడు.
51. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను.
కలనుం గాంచులక్ష్మి కల్లయగును
ఇలను భోగ భాగ్య మీతీరు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.
ఇలలో కలిమి లేములు అలలతో కూడిన నీటి బుడగలు వంటివి. కలయందు కన్పించునంవదవంటివి. అజ్ఞానియే వీటిని స్థిరమని తలచును.
52. కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండముచ్చులెల్లఁ గొలిచినట్లు
నీతిహీను నొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ.
చెడ్డవారి దగ్గర చెడ్డవారే చేరుదురు. నీతిమంతులు వారి వద్దకు పోరు.
53. కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు
సత్య మాడువాని స్వామి యెఱుగు
బెద్దతిండిపోతుఁ బెండ్లామెఱుంగురా
విశ్వదాభిరామ వినురవేమ.
విశ్వమంతా వ్యాపించిన వాడా ఓ రామచంద్రా! అబద్దములాడు వారిని వారి స్నేహి తులు గ్రహించిన చందంగా నిజమును నీవొక్కడవే గ్రహించగలవు. భార్య యొక్కతే భర్త యొక్క భోజనపు తీరును గ్రహించి తగిన భోజనము పెట్టగలదు.
54. కల్ల నిజములెల్ల గరళకంఠు డెరుగు
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగును తనయుని జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.
తన కొడుకు పుట్టుక గూర్చి తల్లికే తెలియును. నీరు ఎగువకు పారదు. వల్లమునకే పారును. నిజానిజములను గూర్చి పరమ శివునకు తప్ప ఎవరికి తెలియును.
56. ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు.
అప్పులేనివాడె యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమ.
55. మైలకోకతోడ మాసిన తలతోడ
నొడలు మురికి తోడ నుండెనేని
నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు.
విశ్వదాభిరామ వినురవేమ.
57. చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
నెనుపగొడ్డు పాలవెంత హితము
పదురాడుమాట పాటియై ధర జెల్లు
విశ్వదాభిరామ వినురవేమ.
'పదుగురాడు మాట పాటియై ధరజెల్లు, అది న్యాయమా, అన్యాయమా, సత్యమా అ సత్యమా ఆది ఎవరును విచారింపరు, పదిమంది మంచిదన్న అదిమంచిది అని న మ్మి ఆచరించెదరు.
58. పట్టుపట్టరాదు పట్టి విడువరాదు.
పట్టెనేని బిగియఁ బిట్టవలెను
పట్టిడుడచుకన్న బడి చచ్చుటయెమేలు
విశ్వదాభిరామ వినురవేమ.
ఏ విషయములోనైనా పట్టుదల పట్టిన అంతము వరకు దానిని నిలుపుకొనే తీరవలె ను.అలాగాక దానిని మధ్యలో వదలి వేయువారు మూఢులు.
59. తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.
ఒక వేలు ఒరుల వైపు, చూపి తప్పు లెన్నువారు తమలోని తప్పులెరుగలేరు. మూడు వేళ్ళు తమవేసే వుంటాయన్న నిజాన్ని కూడా వారు చూడలేదు. మేమంతా అలాంటి మూఢులమే అని వేమన రామునికి విన్నవించుకుంటాడు.
60. అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినదినగ వేము తియ్యగనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.
అన్న విధంగా ఈ శతకకారుడు కూడా 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అని అన్నాడు. పాడగా, పాడగా గొంతు సాగినట్లే, తినగా తినగా చేదు తియ్యనైనట్లే, కష్టపడితే సాధించలేని పనులు లేవు. దృఢసంకల్పమున్నప్పుడే, ఏ వనైనా చేసి తీరా లన్న పూనికవున్నప్పుడే, అది సమకూరుతుంది.
61. తనకుగల్గు పెక్కు తప్పులునుండగా
ఓగు నేరమెంచు నొరులంగాంచి
చక్కిలంబుగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినురవేమ.
నీచుడు ఎంతసేపూ ఎదుటివారి తప్పులు కనుగొనుటకే చూచును తప్ప తన తప్పులు తెలిసికోలేడు. తన లోపములెరిగిన వాడే ధీమంతుడు.
62. ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాల్చి యతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరికూర్ప వచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ.
ఎదుటివారి మనసు నొప్పించుట ఎవకిని భావ్యము కాదు. ఒకసారి ఒకరిపట్ల మన సు నొచ్చుకొనెనా అది సరిచేయుట బ్రహ్మకైననూ సాధ్యముకాదు. అదే ఇనువవస్తు వైతే తిరిగి అతకవచ్చు. అందుకే మాటలాడునపుడు ఆచి తూచి మాటలాడవలెను. మాట పరుషమైన మనసు ఎంత మంచిదైనను మన్నన పొందలేడు.
63. ఒరుని జెఱచెదమని యుల్లమందెంతురు
తమకు జేబురుగని ధరణ్ నరులు
తమ్ముఁ జెఱచువాడు దైవంబులేడొకో
విశ్వదాభిరామ వినురవేమ.
అజ్ఞానులు ఎపుడు ఎదుటివారికి కీడు చేయుటకే తలచెదరు, తమకు కూడ కీడు కల్గజేయుటకు దైవమున్నాడని ఎరుగరు. ఒకనికి ఒక కన్ను పోవలెనని కోరిన మన కు రెండు కళ్ళూ పోవునని ఎరుగనివాడే మూర్ఖుడు,
64. కానివానిచేత గాను వీసంబిచ్చి
వెంట దిరుగువాడె వెఱివాడు
పిల్లి తిన్న కోడి బిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.
65. మాటలాడనేర్చి మనసు రంజిలజేసి
పరగఁబ్రియముచెప్పి బడలకున్న
నొకరిచేత సొమ్ములూరక వచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ.
దైవమునకైనను స్తోత్రములు చెప్పనిదే వరములు రావు. మానినులకైనను మంచి మాటలు చెప్పనిదే మనసివ్వరు. ఎదుటివారి నుంచి నీకేదైనా కావలెనన్న మంచి మాటలే మార్గము. మాట పొందిక లేకున్నా కానీకి కొరగాడు.
66. చంపదగినయట్టి శత్రువు తనచేతఁ
జిక్కెనేని గీడు సేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ.
చంపదగిన శత్రువు చేతికి చిక్కినా ఉపకారము చేయుటయే మేలు, తన యం తటతాను ఇంటికి వచ్చిన శత్రువునైనను ఆదరించుటలోనే నీ గొప్పతనము కన పడును.
67. వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేవి వరదపారు
వరద కరవు రెండు వరసతో నెఱుగుడీ
విశ్వదాభిరామ వినురవేమ.
దేనికీ అతి పనికిరాదు. వానలు కురియకున్నను ఎక్కువ కురిసిననూ కరువే. సమముగా మితముగా వున్నపుడే సుఖసంతోషములు వెల్లివిరియును.
68. పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
బుట్టునా జగంబు పట్లదెపుడు
యముని లెక్కరీతి నరుగుచు నుందురు
విశ్వదాభిరామ వినురవేమ.
పుట్టిన వారందరూ స్థిరముగా నిలచిన భూమియందు చోటు చాలదు. అందుకే యముడు ఆయువు నిండిన వారిని కొనిపోవుచుండును.
69. వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానబడ వెంత ఘనునకైన
గానఁబడినమీద గలియెట్లునడుచురా
విశ్వదాభిరామ వినురవేమ.
భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసిన మనిషి భగవంతుడే అగునుకదా అటు వంటపుడు ఇది కలియుగ మేలాగపుతుంది.
70. చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తికలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ.
లభించిన చోటును పట్టి మన సుఖ దుఃఖములు కల్గును. వాన చినుకు ముత్యపు చిప్పలోబడిన ముత్యమగునట్లే మనకు రాజాశ్రయము దొరకిన ప్రకాశించెదము.
71. ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను
అంటనీయక శని వెంటదిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా
విశ్వదాభిరామ వినురవేమ.
ఏలిన నాటి శని పట్టినపుడు ఎన్ని చోట్ల తిరిగినను దుఃఖములు తప్పవు. తన కర్మా సుభవము ఎక్కడ పోయినా పట్టి పీడిస్తుంది.
72. కర్మమెప్పుడైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగనిచోట
గంకుభట్టుజేసెఁ గటకటా దైవంబు!
విశ్వదాభిరామ వినురవేమ.
కర్మానుభవము ఒక్కోసారి హీనుల దగ్గర కూడ ఒదిగియుండునట్లు చేయును. ధర్మరాజు విరాటుని దగ్గర కంకుభట్టుగా వున్నట్లు.
73. అనువుగానిచోట నధికుల మనరాదు.
కొంచమైన నదియుఁ గొదువగాదు.
కొండ యద్ధమందుఁ గొంచెమైయుండదా!
విశ్వదాభిరామ వినురవేమ.
పెద్దకొండ కూడ అద్దమందు ప్రతిబింబములో చిన్నదిగా కనిపించినా దాని గొప్పదన ముతగ్గనట్లే మనుజుడు కానిచోట్ల అహంకరింపగూడదు.
74. ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్నియుమాని
కాలమొక్కరీలతి గడప వలయు
విజయు డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ వినురవేమ.
సమయా సమయముల కనిపెట్టి గొప్పవాడైనను అవసరమునకు ఆడంబరములు ప్రదర్శింపపక ఏదో ఒక విధంగా కాలంగడుపవలెను. అర్జునుడంతమహాపరాక్రమ వంతుడు కూడా కాలము కలిసిరాక విరాటుని కొలువులో పేడి రూపముతో బ్రతక లేదా!
75. చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్క కఱచి బాధపెట్టు
బలమిలేని వేళఁపంతంబు చెల్లదు.
విశ్వదాభిరామ వినురవేమ.
బుద్ధిమంతుడు తన ఆరోగ్య పరిస్థితిని కూడ దృష్టియందుంచుకొని, నెలవులను చూచికొనియే తన బలమును చూపవలెను, లేనియెడల అల్పుడు కూడ అతని మదమును అణచును, చాలవరకు ఈ పద్యములన్నియు స్థానబలిమిని, కాలం కలిసివచ్చుటను గూర్చి చెప్పును.
76. లక్ష్మీయేలినట్టి లంకాపతి పురమ్ము
పిల్లకోతిపౌజు కొల్లబెట్టెఁ
చేటుకాలమయిన జెరప నల్పులె
చాలు విశ్వదాభిరామ వినురవేమ.
కాలం కలిసి రానపుడు తాడే పామయి కరచును. విధి ఎదురు తిరిగినపుడు లక్ష్మితో కలకలలాడు లంకాపురమును అల్పుడయిన వానరుడు చెరుపకలిగెను.
77. మొదట నాశబెట్టి తుదిలేదుపొమ్మను
పరమ లోభులైన పాపులకును
ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా
విశ్వదాభిరామ వినురవేమ.
వాగ్దాన భంగము కావించిన వాని శవమును కుక్కలు కూడ ముట్టవు. నిరాశ చెందినవారి శాపము ఉండేలు దెబ్బవంటిది. దానమిచ్చు ఉద్దేశ్యము లేనపుడు వాగ్దానము చేయకూడదు.
78. ఇచ్చువాని యొద్ద నీనివాడుండెనా
చచ్చుగాని యీవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చపొదున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.
లోభివాని దగ్గర దాతయున్నను అతని దాతృత్వము సాగదు, కల్పవృక్షము నావ రించి ముండ్లపొద యున్న జనులు కల్పవృక్షము చెంత చేరరు.
79. అరయ నాస్తియనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని దన్నుకొనక
తనది గాదనుకొని తాబెట్టునదె పెట్టు
విశ్వదాభిరామ వినురవేమ.
ఏ దానమన్న విశేష ఫలమియ్యవలెనన్న యాచకుని కోర్కెను తక్షణమే తీర్చుట.
80. ధనముగూడఁ బెట్టి దానంబు చేయక
తాను దినక లెస్స దాచుకొనగ
తేనెనీగ కూర్చి తెరువర కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ.
తేనెటీగలు తేనె కూడ బెట్టి వరుల కిచ్చినట్లు ఇతరులకు దానము చేయక తాను తినక కూడబెట్టినవాడు లోభియనిపించుకొనును. ఇలాటి పద్యమే సుమతి శతక ములో కూడ కలదు.
81. కొంకణంబుపోవఁ గుక్క సింహముగాదు
కాశికరుగఁ బంది గజముకాదు.
వేరుజాతి వాడు విప్రుండు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.
బ్రాహ్మణుడన్న బ్రహ్మజ్ఞానము కలవాడు, కాని ఇతరుడుకాడు. వేరు వేరు చోట్ల తిరిగి నా మనుజుడు తన స్వభావము (నైజము) మార్చుకోలేడు.
82. తవిటి కరయ చోవ దండులంబులగంప
శ్వాసమాక్రమించు సామ్యమగును
వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల పాలు.
విశ్వదాభిరామ వినురవేమ.
తనకున్న దానితో తృప్తిపడక వేరు వేరు లాభములకాశపడువాడు వున్నది కూడ పోగొ ట్టుకొనును.
83. దాతకానివాని దరచుగా వేడిన
వాడు దాత యౌనె వసుధలోన
అవురు దర్భయౌనే యబ్దిలో ముంచిన
విశ్వదాభిరామ వినురవేమ.
దాతకాని వానిని ఎన్నిసార్లు వేడిననూ, సముద్రజలములో ముంచిన ఎండుగడ్డి ధర్మ కానట్లే, ఫలమును పొందజాలడు.
84. పరగ జాతిగుండు బగులగొట్టగ వచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు.
విశ్వదాభిరామ వినురవేమ.
85. వంపుకఱ్ఱ గాల్చి వంపు దీర్చగవచ్చు
గొండలన్ని పిండి గొట్టవచ్చు
గఠినచిత్తు మనసు కరిగింపగారాదు
విశ్వదాభిరామ వినురవేమ.
ఎన్ని అసాధ్యములయిన పనులనయిన (ఇసకనుంచి నూనెను తీయుట, కొండను పిండి గొట్టుట, రాయిని అరుగదీయుట, వంపుకఱ్ఱ వంపుతీయుట) చేయవచ్చును కాని 'కఠిన చిత్తుని మనసు కరిగింపలేము,
86. విత్తముగలవాని వీపున బుండైన
వసుధలోనఁజాల వార్త కెక్కు
బేదవానియింట బెండ్లైన నెఱుగరు
విశ్వదాభిరామ వినురవేమ.
దనవంతుని ఇంట ఏ చిన్న కార్యము జరిగినను బహుళప్రచారము పొందును. పేద వాని ఇంట పెద్దకార్యములకు కూడ ప్రచారము లభింపదు.
87. మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునొందుఁ
గలిమి లేమి రెండుఁగల వెంతవారికి
విశ్వదాభిరామ వినురవేమ.
మగనికాలము స్త్రీ కష్టపడిన కొడుకు కాలములో సుఖపడవచ్చును. కలిమి లేములు కావడికుండలని ఒకదాని వెనక ఒకటి వచ్చుచుండునని సుఖములో పొంగిపోక దుఃఖములో కుంగిపోని వాడే ధీరోదాత్తుడు.
88. తనకులేని నాడు దైవంబు దూరును
దనకుఁ గలిగెనేని దైవమేల
తనకు దైవమునకుఁదగులాట మెట్టిదో?
విశ్వదాభిరామ వినురవేమ.
మానవునకు దేవునకు కలుగు సంబంధము ఎట్టిదో ? సుఖపడుకాలమున అంత యూ తన మహిమేనని, కష్టపడునపుడు నీదే భారమను మనుజుడు ఎంత నికృష్ణు
89. గాజు కుప్పెలోనఁ గదలక దీపంబ
దెట్టులుండు జ్ఞాన మట్టులుండు
తెలిసినట్టి వారి దేహంబులందున
విశ్వదాభిరామ వినురవేమ.
పరమాత్మ స్వరూపమును తెలిసికొన్న వారి జ్ఞానదీపము వారినే గాక వారి నాశ్రయిం చిన వారిని కూడ మోక్షవదమును చేర్చును,
90. అంతరంగమందు నపరాధములు చేసి
మంచి వానివలెనె మనుజుడుండు
ఇతరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ.
మనుజుడు తనలోని భావములను ఎన్ని దాచుకొన్నను సర్వాంతర్యామియయిన భగ వంతుని ముందు దాచలేడు కదా
91. చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింకఁ జదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ.
ఎన్ని చదువులు చదివి. ఎంత విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనుజుడు మూర్ఖుడే కదా!
92. జననమరణములకు సర్వస్వతంత్రుండు కాడు మొదటఁగర్తకాఁడే తుదనుకాఁదు
నడుమఁగర్తననుట నగుబాటు కాదొకా
విశ్వదాభిరామ వినురవేమ.
మూర్ఖుడు తన జనన మరణములకు అన్నింటికి తానే కర్తయని విర్రవీగును. సుబుద్ధి ఆత్మతత్వమును తెలిసికోగలిగియుండును.
93. నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మారును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ.
మూర్ఖుని స్వభావము మాటిమాటికి మారిపోతూవుంటుంది. ఆది నీటిమీద వ్రాతవలె విలువలేనిది.
94. తల్లియున్నయపుడె తనదు గారాబము
లామె పోవఁదన్ను నరయరెవరు
మంచికాలముపుడే మర్యాదనార్జింపు
విశ్వదాభిరామ వినురవేమ.
కాలం కలిసి వచ్చినపుడే గౌరవ మర్యాదలు ఆర్జించుకోవలెను, లేనపుడు ఎందుకూ కొరగారు, అది ఎట్లన తల్లి బ్రతికియున్నప్పుడే గారము సాగినట్లు,
95. మాటలాడవచ్చు మనసుదెల్పఁగలేడు
తెలుపవచ్చుఁదన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.
మనసెరిగి మాటలాడు వాడే నేర్పరి. కత్తిపట్టిన వాడంతా శూరుడుకానట్లే అందరూ నేర్పరులుకాలేదు.
96. శాంతమే జనులను జయమునొందించును
శాంతముననె గురుని జాడ తెలియు
శాంత భావమహిమ జర్చించలేమయా
విశ్వదాభిరామ వినురవేమ!
శాంతము యొక్క గొప్పదనము ఇంతింతనరానిది. శాంతముతో సాధించరానిది
97. ఆడితప్పవారలభిమాన హీనులు
గోడెఱుఁగని కొద్దివారు కూడి
కీడు సేయఁగ్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినురవేమ.
క్రూరులు మంచివారిలా కన్నిస్తారు. అత్మాభిమానము వదిలి, మంచి చెడ్డయనక అబద్ధాలతో బ్రతుకుతారు. కూరాత్ముల స్వభావము నెవరును మెచ్చుకొనలేరు.
98. తఱచు కల్లలాడు ధరణీశులిండ్లలో
వేళవేళ లక్ష్మి వెడలిపోవు
నోటికుండలోన నుండువా నీరంబు
విశ్వదాభిరాను వినురవేమ.
అబద్ధాలాడితే రాజులైనా సరే వారి యిండ్లలో సంపద నశించిపోవును. చిల్లికుండలో నీరు నిలవనట్లే అసత్యమునకు విలువయుండదు. కాబట్టి అసత్యాలు ఆడరాదు. అవి ఎలాగో బయటపడతాయి.
99. చంపగూడదెట్టి జంతువునైనను
చంపవలయు లోక శత్రుగుణము
తేలుకొండిఁగొట్టందే లేమి చేయురా
విశ్వదాభిరామ వినురవేమ.
మనుము ఏ క్రూరజంతువును చంపరాదు. ఈ లోకములో హింసాప్రవృత్తిని, చెడు బుద్ధిని వదిలివేయాలి. తేలుకొండిను తీసివేస్తే తేలునుంచి ఎటువంటి హాని కలు
100. ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
నిశ్చలముగా దృష్టి నిలిపెనేని
అతడునీవె సుమ్మి యనుమానమేలరా
విశ్వదాభిరామ వినురవేమ.
మనస్సులోనే ఆత్మను అచంచల ఏకాగ్రతతో ధర్మించిన మోక్షమును పొందవచ్చు. గురూపదేశము వలనే ఇది సాధ్యము,
101. దేవపూజలందు దేవాలయములందు
దేవుడుంట జెప్పి తెరువుజూపి
తెలియ విశ్వమెల్ల దేవాదిదేవుడే
విశ్వదాభిరామ వినుర వేమ.
పూజలు జరిగే చోట, దేవాలయాల్లో దేవుడున్నాడని చెబుతారు. విశ్వమంతటా ఆ దేవదేవుడు లేని చోటు లేదని తెలియరు.
Comments